Tuesday, December 15, 2009

సమైక్య వాదమా..? వేర్పాటు వాదమా..?

'చిన్న కుటుంబం చింత లేని కుటుంబం' అనే పట్టణ ప్రాంత సంస్కృతి ధోరణి లొ వేర్పాటు వాదం ఉంటే, 'కలసి ఉంటె కలదు సుఖం' అనే గ్రామీణ దృక్పదం లో సమైక్య వాదం ఉంటుందని భావింపవచ్చు.సమకాలీన కుటుంబ వ్యవస్థ లోనే సమైక్యత (ఉమ్మడి) , ప్రత్యేకత(వేర్పాటు) అనే ధోరణులు కనబడుతుంటాయి.

ప్రపంచీకరణ నేపథ్యం లొ సాగుతున్న ప్రస్తుత యుగం లో 'వేర్పాటూ,'సమైక్యతా వంటి భావనలతో జరుగుతున్న ఉద్యమాలలొ ప్రజల క్రియాశీల పాత్ర అభినందనీయమైనప్పటికీ , తెలుగు ప్రజలు (అంధ్రా,తెలంగాణా,రాయలసీమ) మరొక్క అడుగు ముందుకేసి, వ్యష్ఠి గాను,సమిష్ఠి గాను తమ తమ ప్రాంతాలలో సాంఘికాభివృధ్ధి సాధన దిశగా ఉద్యమించి (విద్య,అరోగ్యం,పేదరిక నిర్మూలన) ,దేశ ఆర్దికాభివృధ్ధి లో కీలక పాత్ర పొషిస్తూ , ప్రపంచ వ్యాప్తం గా తమ ప్రత్యేకత ను చాటుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.'రాజకీయాల కోసం రాజకీయాలు ' కాకుండా 'అభివృధ్ధి కోసం రాజకీయాలు ' సామాన్యుడికి ఉపయోగపడతాయని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాఖ్యానించడం గమనార్హం.

వేర్పాటు వాదము, సమైక్య వదము అనే భావాలకు వ్యక్తపరచే విధానంలో భాగంగా పౌరులు తమ నిరసనలు తెలపడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులు దుర్వినియోగ పరచకుండా , ఏకతా,సమగ్రత,సమైక్యత సాధించే దిశగా తమ విధులను నిర్వర్తించవలసి ఉన్నదని రాజ్యాంగం సూచిస్తుంది.ప్రభుత్వము,రాజకీయాలకు గల వ్యత్యాసాలను ప్రజలు గుర్తించి,ప్రభుత్వ ఆస్తులను ప్రజల అస్తులుగా పరిగణించి , అహింసహాయుత మార్గాలలొ ఉద్యమించి ఫలితలు సాధించ వచ్చునని 60 ఏళ్ళ క్రితమే నిరూపించబడింది.ఇటీవల జరిగిన ఉద్యమాలలొ ప్రభుత్వ రంగ సంస్థ R.T.C, ఇప్పటివరకు సుమారు 85 కోట్ల పైగా నష్టాన్ని చవిచూసింది. 1990 దశకం లో ఆర్దిక సంస్కరణల నేపధ్యం లో భాగంగా, పెరిగిన ప్రైవేటు పెట్టుబదులు, మన ఆర్ధిక స్థితి గతులలో ప్రభావం చూపించాయి అనడం లో సందేహం లేదు. ఫ్రైవేటు సంస్థల ఆస్తుల విద్వంసం, విదేశీ పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపి ప్రైవేటు రంగ పెట్టుబదులు తగ్గే ప్రమాదం ఉంది.

సమైక్యవాదం, వేర్పాటు వాదం అనే భావనలు ప్రాంతాలకతీతంగా ప్రజలందరి మధ్య ఉన్నాయి అనే విషయం గమనించవచ్చు.అనగా రాష్ట్రం లోని మూడు ప్రాంతాలలోను ఈ భావనలు కనిపిస్తున్నయి.సమైక్యత,'ప్రత్యేకత' వంటి భావనలు పరిశీలించినప్పుదు , ఒక ప్రాంతం లోని ఆర్ధిక,సామాజిక,రాజకీయ అంశాలను పరిగణించవచ్చు.

అక్టోబరు మాసంలో రాష్ట్రం లో వచ్చిన వరదలకు రాష్ట్ర ప్రజలంతా ప్రాంతాలకతీతంగా స్పందించిన తీరును గమనించినప్పుదు సమైక్యత,సోదరభావం అనే భావనలు ప్రజలందరిలో సజీవంగా ఉన్నయి అని భావింపవచ్చు.'భిన్నత్వం లొ ఏకత్వం' సాధించే లక్ష్యం తో మన రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వన్ని కల్పించారు.రాస్ట్రం లో జరుగుతున్న ఆర్ధికాభివృధ్ధి లో అవలంబించే విధానాల వల్ల ప్రాంతీయ,ఆర్దిక,ఆదాయ అసమనతలు ఏర్పడుతున్నయి. ఇటువంటి పరిస్థితులను ఆసారాగా చేసుకుని కొందరు స్వార్ధపరులైన రాజకీయ నాయకులు, ప్రాంతీయ అసమానతలు తొలగడానికి మార్గాలు అన్వేషించడం మాని, ప్రజల మనో భావాలనే సాధనం గా చేసుకుంటూ, వేర్పాటు ధోరణులకు ఆజ్యం పొస్తున్నారు అనే భావన ఉంది.రాష్ట్రం లో గత రెండు దశాబ్దాలు గా పాలించిన ప్రభుత్వాలను పరిశీలించినపుదు , ఏదో ఒకే ప్రాంతాన్ని అభివృధ్ధి చేసి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన సంధర్భాలు ఎక్కువ కనబడతాయి.1990,2000 దశకాలలో ప్రైవేటీకరణ నేపధ్యం లో భాగంగా సేవా రంగ కార్యకలాపాల విస్తరణ కు ప్రాధాన్యం పెరిగింది.దీనివల్ల అధిక శాతం ఆర్దిక కార్య కలాపాలు పట్టణ ప్రాంతలకే పరిమితమై,గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యమవుతూ వస్తున్నాయి.గత కాలం లో రైతుల ఆత్మహత్యలే దీనికి సాక్ష్యం.ఇటీవల అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ రంగం కొంత మెరుగు పడింది.ప్రస్తుత సంవత్సరం లో రాష్ట్రం లో రైతుల అత్మహత్యలు గణనీయం గా తగ్గినవని ఇటీవల కేంద్ర వ్యవసాయ శఖ సహాయ మంత్రి తెలిపారు. మన పాలకులు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అనుమతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి, గ్రామీణ వనరుల లభ్యత ఆధారం గా చైనా వంటి పొరుగు దేశాలను ఆదర్శం గా తీసుకొని, గ్రామీణ రంగాలలొ అంతర్గత మరియు సంస్థాగత సంస్కరణలు తీసుకు వస్తూ, గ్రామీణ పారిశ్రామికీకరణ తో అభివృధి సాధించి, తద్వారా ప్రాంతీయ అసమానతలు రూపు మాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుత హైటెక్ కాలం లో వేర్పాటు అనే భావన కుటుంబ స్థాయి లోనే కనబడుతుంది.ఈ ధోరణి ఎక్కువగా పట్టణ ప్రాంత జీవన శైలి లోనే గమనించవచ్చు.'ప్రత్యేకత' ద్వారా తమ తమ ప్రాంతాలకు కేంద్రం నుండి వనరులను లో సమీకరించుకుని , నిరక్షరాస్యత,పేదరిక నిర్మూలన,నిరుద్యోగం వంటి సాంఘిక రుగ్మతలను నిర్మూలించడానికి , తమ ప్రాంత సాంప్రదాయాలు ,సంస్కృతులకు అనుగుణం గా సంక్షేమ పథకాలు అమలు చేసి, తద్వరా అభివృధ్ధి పథం లో ముందుకు సాగుతూ , తమ 'ప్రత్యేకత'ను చాటుకొవాలనే ఉత్సహం వేర్పాటువాదులలో కనబదుతుంది. ఒక ప్రాంతంలో లభ్యమయ్యే మౌళిక వనరుల అభిలషనీయ వినియోగం పట్ల, ఆ ప్రాంత ప్రజలకే స్పష్టమైన అవగాహన ఉంటుంది అనడంలో సందేహం లేదు. పాలకులు ప్రాధమిక స్థాయి లో స్పష్టమైన అవగాహన కలిగి,కేంద్రం నుండి అవసరమైన వనరులు మళ్ళించుకోగలిగి,వాటిని దుర్వినియోగ పరచకుండా, నిస్వార్ధంగా,నిజాయితో వినియోగించినప్పుదు అభివృధ్ధి తారా స్థాయి లో ఉంటుంది.దురదృష్టవశాత్తు ప్రస్తుత తరం రాజకీయ నాయకులను పరిశీలించినప్పుదు అధిక శాతం ధనార్జనే ధ్యేయం గా రాజకీయాలలోకి రావడం,రాజకీయ వారసత్వాలను ప్రొత్సహిస్తూ, ప్రజా ధనాన్ని తమ ఖాతాలలోకి మళ్ళించుకునే వ్యాపార రంగం గా రాజకీయ రంగం రూపాంతరం చెందడం విచారకరం.భారత్ వంటి గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యంలో రాజకీయ వారసత్వం అనే జాడ్యం క్షేత్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు పట్టి పీడిస్తుంది.

గత దశాబ్దకాలం లో ఏర్పడిన ప్రభుత్వాలు అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అనే విషయాన్ని గమనించవచ్చు.సంకీర్ణ ప్రభుత్వాలలో అధిక మెజారిటి గల ప్రాంతీయ రాజకీయ పార్టీలు కీలక పాత్ర పొషిస్తూ , అసమానతలకు దారితీసే అవకాశాలు ఎక్కువ. రాష్ట్రాలు స్వయంప్రతిపత్తి కలిగి , స్వతంత్రం గా పరిపాలించుకునే అవకాశం ఉండే అమెరికా వంటి దేశాలలో అమలవుతున్న సిద్ధాంత పరమైన సమాఖ్య విధానం భారత్ లో కనబడదు. మన దేశంలో కేంద్రీకృత ధోరణులు గల సమాఖ్య విధానం అమలులో ఉంది.రాజ్యాంగం లోని 11,12 భాగాలలో పొందుపర్చిన కేంద్ర-రాష్ట్ర పరిపాలనాధికారల పంపిణీ,కేంద్రం యొక్క అవశిస్టాధికారాలు పరిశీలించినప్పుదు ఈ విషయం అవగతమవుతుంది.ఇటువంటి రాజకీయ వ్యవస్థ గల దేశం లో 'ప్రత్యేకత' తో అభివృధ్ధిని వేగవంతం చేయాలి అంటే, కేంద్రంలో క్రియాశీల పాత్ర పొషించగలిగే సమర్ధ నాయకులు ఎంతైనా అవసరం.కాని ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినప్పుదు మరిన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవిర్భవించి, చివరకు ప్రజాస్వామ్య సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.'ప్రత్యేకత' ద్వారా ఏర్పడిన రాష్ట్రాలు, తమ అభివృధ్ధి లో భాగంగా అవసరమైన వనరుల సమీకరణ సమయాలలో అంతరాష్ట్ర వివాదాలకు దారితీసి, రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి ఆటంకాలు ఏర్పడతాయి.ఆంధ్ర ప్రదేశ్ వంటి భాషా ప్రయుక్త రాష్త్రాలు విభజించబడినప్పుదు, తెలుగు భాషా ప్రాతినిధ్యం ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలలో పెరుగుతుంది.

సమైక్యమా? ప్రత్యేకమా? అనే అంశం అనివార్యమైనప్పుడు, ప్రజాస్వామ్యం లో 'ప్రజలే పాలితులు,ప్రజలే పాలకులు ' అనే నినాదం తో , రాజకీయాలకు అతీతం గా ప్రజలే నేరుగా శాసించే అవకశం ఉన్నటువంటి , స్విట్జర్లాండ్ వంటి దేశాలలో అమలవుతున్న ప్రత్యక్ష ప్రజస్వామ్య పద్దతులు (రీకాల్,రెఫరెండం వంటి పద్దతులు) అవలంబించినపుదు ప్రజల మనోగతం అవగతమై,పరిష్కారం సులభం అవుతుంది.ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్దతులలో ప్రజలు విద్యావంతులు కావాల్సిన అవసరం ఉన్నప్పటికీ,ప్రస్తుత కాలంలో రాజకీయ,సాంఘిక రంగాలలొ పెరిగిన ప్రజల అవగాహన గమనించదగినది.ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో కీలక అంశాలకు పరిష్కార మర్గాలుగా ప్రత్యక్ష ప్రజాస్వమ్య పద్దతులకు అవకాశం కల్పిస్తూ,రాజకీయ వారసత్వాన్ని సమూలంగా నిర్మూలించే అంశాలు చేర్చి,ఒక వ్యక్తి క్రియాశీల రాజకీయ పాత్రకు పరిమితులు విధించే విధంగా సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని భావింపవచ్చు.'ప్రత్యేకత',సమైక్యత వంటి సున్నిత అంశాల పరిష్కార మార్గంలో భాగంగా రాజకీయ నాయకుల పాత్రను పరిమితం చేసి,ప్రజలే క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా సంస్కరణలు చేపట్టినప్పుడు, ప్రజాస్వామ్యానికి తగిన న్యాయం చేకూరుతుందని భావింపవచ్చు.

------------------------------------------------------------------------------------
విజయ్ శేఖర్